Sathsangamu dated 28.03.2015 [Sree Raama Navami]ఓం సద్గురుపరబ్రహ్మణే నమః

ఎవరైనా ఏమైనా అడుగుతారా? ఎవరైనా ఏమైనా అడిగేవాళ్ళు వుంటే అడుగవచ్చు. ఎవరైనా ఏదైనా అడుగవచ్చు open for all. ఏదైనా అడుగవచ్చు, ఎవరండి మిమ్మల్ని (మీకు) ఇలా జీవితంలో offer ఇచ్చేది. ఏదైనా అడుగవచ్చని, మీ ఇష్టం వచ్చింది అడగమనేవాళ్ళు ఎవరు? మీరు ఏదైనా అడుగవచ్చు. మీరిస్తారా ఎవరైనా, మీ జీవితంలో ఎవరికైనా, మీరు ఏదైనా అడగండని open challenge ఎవరికైనా ఇస్తారా? ఎప్పుడైనా ఇచ్చారా? అలా వచ్చిన రోజున మీరు జ్ఞానులుగా పిలువబడుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అంటే అర్థం అది. మీకు ఆ సమర్థత వుండాలి. ఒక స్థిర బుద్ధి వుండాలి. స్థిర చిత్తం వుండాలి. దేనినైనా అలా చూస్తేనే గ్రహించగలిగే సమర్థత వస్తుంది అప్పుడు. బోధించనక్కర్లేదప్పుడు. అర్థమైందా? ఊరికే వివేకచూడామణి 16సార్లు తిరగేశామండి, అష్టావక్రగీత 13సార్లు తిరగేశామండి అంటే లాభం లేదు. అర్థమైందా? శాస్త్ర పరిజ్ఞానం దగ్గర ఆగకూడదు ఎప్పుడూ కూడా.
స్వానుభవమే జ్ఞానంగా మారుతుంది. అనుభవం లేనటువంటిది, నిద్రపోతే పోతుంది. అర్థమైందా? , ఎవరైనా ఏదైనా అడుగవచ్చు.

గురువుగారు! ప్రొద్దున (సత్సంగంలో) విచారణ చేసేది మనోబుద్ధులా అన్నదానికి Answer మనోబుద్ధులకే విచారణ కదండీ? [ఏమో నాకు తెలియదు, పాఠం విన్నది మీరు కదా!]
నాకేమని అనిపించందంటేనండీ, మనోబుద్ధులే విచారణ చేసి, చివరికి జ్ఞానం కలిగిన తరువాత ఆ మనోబుద్ధులు వాటంతటవే రాలి పోతాయి అని అనిపించింది.
ఇప్పుడూ, సముద్రంలోనుంచి వర్షం వచ్చింది, అంతేనా? సముద్రంలోనుంచి సరాసరి వర్షం వచ్చిందా? మేఘాలుగా మారి మేఘాల నుంచి వర్షం వచ్చి, వర్షాలు నదులైనాయి, నదులు మళ్ళా సముద్రంలోకి పోయినాయి. అంతేనా?
ఇప్పుడు మేఘాలు వాస్తవమా? నదులు వాస్తవమా? సముద్రము వాస్తవమా? సముద్రమే వాస్తవము. మరి ఏ చైతన్యంలో నుంచైతే మనో బుద్ధులు వ్యక్తమయినవో, ఈ మనోబుద్ధులు మరళా ఆ చైతన్యాన్నే తెలుసుకున్నాయి. ఇప్పుడు రాలిపోవడం అనే సంగతి వుందా అక్కడా? లేదు. అస్సలు లేవుగా? లేని వాటిని ఉన్నాయి అనుకున్నావు నువ్వు. ఉన్నాయి అనుకుని కొంతకాలం ప్రవర్తించావు. వ్యవహరించావు. వ్యవహరించినాక ఏం తెలిసింది? లేవని తెలిసింది. ఉన్నది నువ్వేనని తెలిసింది. అయిపోయింది. ఇప్పుడు ఉన్నప్పుడు కదా రాలిపోవడం? అంతేనా కాదా? కాబట్టి అజ్ఞానం అంతా ఎక్కడుంది?
లేనిదానిని ఉన్నదనుకోవడంలో అజ్ఞానం వున్నది
ఉన్నదానిని చూడలేక పోవడంలో అజ్ఞానం వున్నది
ఏది వున్నదో అది కనబడటం లేదు. ఏది లేదో అది కనబడుతుంది. ఇవి రెండు తగదాలు. ఈ రెండు తగదాలను పరిష్కరించడానికే విచారణ. అర్థమైందా? ఇప్పుడు ఈ అమ్మాయికి పాఠం రావాలంటే స్కూల్‌కు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా? మాస్టారు పాఠం చెప్పాలా వద్దా? (చెప్పాలి). మాస్టారు పాఠం చెప్తే వస్తుందా? నువ్వు చదువుకుంటే వస్తుందా? (రెండు రకాలుగా). ఆ.. మాస్టారు పాఠము చెప్పాలి, నీకు అర్థమూ అవ్వాలి. నువ్వు చదువుకోవాలి. అంతేనా? ఈ రెండిటిలో ఏది లోపం జరిగినా? (మార్క్స్‌ రావు). పాఠం సరిగా రాదు, మార్కులదేముంది? ఇవాళ కాకపోతే రేపు వస్తాయి. అంతేనా కాదా? పాఠం సరిగా రావాలి మనకు, అంటే జ్ఞానం సరిగా రావాలి. దానికి సంబంధించిన వికాసం సరిగా రావాలి. వికాసం వస్తే ఏమైంది? పోయిన క్లాసులో మనం చదువుకున్న పాఠానికి, ఈ క్లాసులో మనం చదువుకున్న పాఠానికి తేడా తెలియటంలా? తెలుస్తుందా? లేదా? (తెలుస్తుంది). వికాసం రాకపోతే?
Once upon a time, there was a Sancho Panza.
మా చిన్నప్పుడు బట్టీ పట్టించే వాళ్ళు స్టోరీ. మాతరం వాళ్ళందరికీ, మా ముందుతరం వాళ్ళందరికీ బాగా తెలుసు. అర్థమైందా అండీ?
ఆవు తెల్లగా వుండును, రెండు కొమ్ములు వుండును, ఒక తోక వుండును. అదే ఆవు వ్యాసమే ఏం డిఫెరెన్స్‌ వుండదు. వెటర్నరీ డాక్టర్‌గా చదువుకుంటే? అదే ఆవే చాలా తేడా వుంటుంది. అర్థమైందా? కాబట్టి ఎదిగే కొద్దీ ఏం మారుతున్నాం? వికాసం మారిపోతుంది. ఆ వికాసం మనకు స్థిరంగా వుంటేనేమో, జ్ఞానం స్థిరంగా వుంటుంది. అదే వికాసం మరుపుకు వెళ్ళిపోతే? మళ్ళా పాత పాఠమే. దీనిని బట్టి విచారణ అనేది ఒక సాధనం. నీ పనిముట్లు శరీరం, ప్రాణం, మనసు, బుద్ధిని ఉపయోగించి చేసేటటువంటి ఒక సాధనం. ఆ సాధన నీకు ఒక లక్ష్యం దిశగా నడచినప్పుడు, అది చూపెట్ట వలసినటువంటి ఇవ్వవలసినటువంటి దృష్టిని ఇస్తుంది. ఆ దృష్టి వచ్చేసింది అనుకోండి? అప్పుడేమయ్యింది? ఈ ప్రపంచమే, ఈ ఇహలోకమే, ఏమని చెప్తున్నారు? ఇహమే పరమై ప్రకాశించగా.... అక్కడెక్కడో ఆకాశం అవతల లేదు పరం.
        ఈ ఇహలోకాన్నే ఆ పరమైనటువంటి దృష్టితో చూస్తే, (అప్పుడేమయింది?)
ఈ ఇహం నీకు బంధ హేతువు కాలేదు. ఈ ఇహమే మోక్షకారకమైనది.
       ఇప్పుడు మన కంప్లైంట్‌ అంతా ఎవరి మీదా? మన మీదా? ప్రపంచం మీదా? అయితే మనమీదా? లేకపోతే ప్రపంచం మీద. నేను ఇలా వుండటానికి కారణం ఎవరు? మొదటి కారణం నేను. రెండవకారణం ఎవరు? ప్రపంచం. అంతేకదా! ఈ రెండూ కారణమేనా అని విచారణ చెయ్యాలి. ఈ రెండు కారణమేనా అని విచారణ చేస్తే ఏమైంది? కార్య కారణ వివేకం అంటారు దీనిని. ఉన్నది ఈశ్వరుడే అయినప్పుడు, సృష్టి అంతా ఈశ్వర నియమితమై వున్నప్పుడు మధ్యలో నేను కారణం ఎలా  అయ్యాను అసలు? అంతేనా కాదా? ఈ సృష్టి అంతా ఎవరి నియతి చేత పనిచేస్తుంది? ఈశ్వర నియతిచేత పనిచేస్తుంది. ఎవరు సృష్టించారు? ఈశ్వరుడే సృష్టించాడు. ఎక్కడినుంచి సృష్టించాడు? తనలోనుంచే సృష్టించాడు. అంతేకదా! మరి తనలోనుంచే సృష్టించబడినటువంటి సృష్టి ఈశ్వరుడు కాకుండా అన్యం ఎలా అయ్యింది? మీ నుంచి సృష్టించబడినటువంటి మీ సంసారం మీకంటే భిన్నం అవుతుందా? అయ్యే అవకాశం లేదుగా. మీ సంసారం మీకంటే భిన్నం కానప్పుడు....
ఈశ్వరుని నుంచి ఉద్భవించిన సృష్టి, ఈశ్వరుని కంటే భిన్నం ఎట్లా అవుతుంది? కాదుగా.
మీకు మీ పిల్లలను చూసినప్పుడు ఎందుకు అనురాగం కలుగుతుంది? మీ ప్రతిబింబాలు కాబట్టి అవి. మీ లక్షణాలే అక్కడ చూసుకుంటున్నారు కాబట్టి. ఈశ్వరుడినుంచి (ప్రతిబింబమైన) ఉత్పన్నమైన సృష్టియందు కూడా... అప్పుడు ఎవరుండాలి? ఈశ్వరుడే ఉన్నాడు. మనకెందుకు మరి ఈశ్వరుడు కనపడటంలేదు? అది కదా ప్రాబ్లమ్‌! మన problem అంతా ఏమిటి ఇప్పుడు? ఉన్నది ఈశ్వరుడే కానీ మనకు కనపడటంలేదు. కారణం ఏమిటి? ఆ ఈశ్వర లక్షణాలతో మనం జీవించటం లేదు కనుక. నేను కర్తను అనుకుంటున్నాను కాబట్టి. మొదటి కారణాన్ని నిన్నే పెట్టుకున్నావు కాబట్టి, నా జీవితం మొత్తానికి నేనే కారణం, అప్పుడేమైపోయింది? నేను వేరే, నా జీవితం వేరే, ఈశ్వరుడు వేరే. నేను వేరే, నా ప్రపంచం వేరే, ఈశ్వరుడు వేరే. ఇదే మొదటి భ్రాంతి. ఈ భ్రాంతే అనేక రకాలుగా పరిణామం చెందింది. బంధహేతువు అవుతోంది.
       నేను ఈశ్వరుడు ఒక్కటే అనే జ్ఞానం స్ఫురిస్తే ఏమైంది? ఎప్పుడు స్ఫురిస్తుంది? నేను చదువుకోవడానికి ఎవరు కర్త? ఇప్పుడు ఈ అమ్మాయి చదువుకోవాలండీ, వాళ్ళ మాస్టారు లేకుండా చదువుకోగలదా? (లేదు) కాబట్టి ఈమెకు దైవం ఎవరు? వాళ్లకు పాఠం చెప్పే మాస్టారే. అంతేనా కాదా? కాబట్టి అందుకనే మనకి కళ్ళ ఎదురుగా కనపడే దైవాలుగా ఎవర్ని చెప్పారు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ. అర్థమైందా అండీ? మనల్ని దేన్నయినా కూడా దైవీభావంతో చూడమన్నారు.
       అసలు దైవము అన్న శబ్దము ఎక్కడినుంచి వచ్చింది? ‘దివి. దివికి opposite ఏమిటి? భువి. అర్థమైందా అండి? ఎందుకు ఇలా పెట్టారు? భువి లోనుంచి వచ్చింది భవము. ఇప్పుడు మనం అందరం ఏం దాటాలని ప్రయత్నిస్తున్నాము? భవమును దాటడానికి ప్రయత్నిస్తున్నాము. అదేదో పెద్ద అనంతంగా వుంది, సాగరం అనంతంగా వుందని సాగరాన్ని జోడించారు. భవసాగరం - దానికి వాల్యూ పెంచామన్నమాట. 'లేని నదిని దాటతాను' అన్నాడట ఎవడో ఒకడు. అట్లావుంది. అర్థమైందా అండి? ఉన్నది దైవమే అయితే, నీకర్జంటుగా ఈ భువి ఎక్కడినుంచి కనపడింది? ఈ భవము ఎక్కడి నుంచి వచ్చింది?
అంటే ఉన్నది దైవం అనే పూర్ణవిశ్వాసము లేదు. ఆ పూర్ణవిశ్వాసము వుంటే ఏమైంది? అప్పుడిది కనపడలేదుగా. నాకు ప్రపంచం కనపడుతుంది కదా! అన్నాడు. అయితే నీకు భవము ఉంది పో! అన్నాడు. ఏమిటి తేడా అసలు ఈ భువికి, దివికి? అంటే నువ్వు చూస్తూ వుండగానే నశించి పోతుంది. అదంతా భవము. భవము అంటే ఏమిటి? ఎప్పుడో నువ్వు పోయినాక పోయేది కాదు. నువ్వు చూస్తూ ఉండగానే అంతా నశించిపోతుంది, మారిపోతుంది. అది భవము. నీ జనన మరణాలతో పనిలేకుండా వాటితో పోల్చి చూసినప్పుడు మారకుండా వున్నాయి. సూర్యుడు ఉన్నాడండీ, భవమా? దైవమా? దైవం. ఎందుకూ? ఆయన ముందు మనం చాలాసార్లు పుట్టాం పోయాం, చాలాసార్లు పుట్టాం పోయాం. ఆయన మాత్రం పోలేదు. అంతేనా కాదా? అంటే మన జనన మరణాలు అనే కాలానికంటే మించినటువంటి, పరమైనటువంటి కాలంలో ఏవైతే ఎప్పుడూ వుంటున్నాయో వాటన్నింటినీ మనవాళ్ళు ఏం చేశారు? దైవము అని పెట్టేశారు. ఇది మహర్షులు చేసినటువంటి ప్రయోజనకరమైనటువంటి పని. వాయుదేవుడు, వరుణ దేవుడు, అగ్ని దేవుడు, భూమి దేవత, భూదేవి అర్థమైందా అండీ? అన్నీ దైవమే మనకి. ఎందుకని అలా పెట్టారు? అవి నువ్వు పుట్టక ముందునుంచి వున్నాయి. నువ్వు పోయినా వుంటాయి. నీ చావు పుట్టుకల మధ్యలో అవి ఏ మార్పు చెందవు. అవి నశించవు. కాబట్టి వాటినన్నింటిని ఏమన్నారు? దైవంగా భావించవయ్యా! ఎందుకని? వాటి వల్లే నీవు నీ పరిణామం అంతా ఆధారపడి వుంది కాబట్టి. అవి లేకపోతే ఆ పంచభూతాలు లేక పోతే నీ జీవనము లేదు, నీ పరిణామము లేదు, నీ చదువూ లేదు, నీ సంపాదనా లేదు, ఏదీ లేదు. కాబట్టి.....
నీవు దేనిమీదైతే ఆధారపడి వున్నావో, ఆ ఆధారభూతమైనదంతా దైవమే.
ఇది భారతీయ తాత్విక దృష్టి.
       సూర్యుడిని దైవమనే ఎందుకనాలీ అండీ, నేను సూర్యుడనే అంటాను, అనూ. ఇప్పుడేం పోయింది? నువ్వు దైవం అని అనకపోయినంత మాత్రాన సూర్యుడికేమైనా తగ్గిందా? ఏం తగ్గలేదు. సూర్యుడిని దైవంగా చూడడం వల్ల నీకు కలిగిన ఉపాయం ఏమిటి? ఉపయోగం ఏమిటి? ఆరాధనాభావం వల్ల మనలో ఉన్నటువంటి ఆవరణ దోషం తగ్గిపోతుంది. అహంకార దోషం తగ్గిపోతుంది. నేను నేననేటువంటి అహంకారం తగ్గిపోతుంది. ఆ దైవీ భావన వల్ల నేను, నేనని పొంగి పోయేటటువంటి అహంకారం కాస్తా తగ్గిపోతుంది. 100 కి 100 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఏ పిల్లాడైనా ఏం చెప్తాడు? నేను ఏం రాశాననుకున్నావ్‌ పరీక్ష! అద్భుతంగా రాశాను. అన్ని ప్రశ్నలు వచ్చినవే వచ్చినాయి. బాగా వ్రాసాను నేను. 25 ఎడిషనల్‌ షీట్స్‌ రాశాను. అందుకని ఎన్ని మార్కులు వచ్చినాయి. 100. వాళ్ళ మాస్టారు పాఠం చెప్పక పోతే? 100 లో ఒక సున్నా కొట్టి వేయాలి. 10 మార్కులు వస్తాయి. ఇప్పుడు అసలు ఈ వంద మార్కులకు కారణ భూతుడు ఎవరూ? ఉపాధ్యాయుడు. కానీ ఏ పిల్లవాడైనా ఏమనుకుంటున్నాడు? మనం కూడా అదేదశలోనే వున్నాం. అవునా కాదా? జీవితంలో ఏదైనా సరే మనం ఒకటి సాధించగానే ఏమనిపిస్తుంది మనలోపల? బ్రహ్మాండం బ్రద్దలు కొట్టేశానండీ, ఏమిటది నువ్వు కొట్టింది? ఏమీ లేదు. కాబట్టి ఈ నేననే అహం ఏం చేసింది ఇప్పుడు? ఎప్పటికప్పుడు నిన్ను పరిమితింపచేస్తోంది. ఎప్పటికప్పుడు నిన్ను ఒకదానికి లోబడేటట్లు చేస్తోంది. మాక్కూడా చెప్తారు. నువ్వేకదా పాఠం చెప్తావనీ బోల్డుమంది చప్పట్లు కొడతున్నారని.. మా శ్రీమతి గారు అదే చెప్తారు, నువ్వు హైదరాబాదు ఎందుకు వెళ్తావు? బాగా అందరూ చప్పట్లు కొడతారని, ఇక్కడైతే ఎవరూ చప్పట్లు కొట్టేవారు లేరు కదా! అందుకని అక్కడికి వెళ్తూ వుంటావు. అది. అదికూడా ఒక అహమే. అర్థమైందా అండీ?
అంటే మన లోపల ప్రతి చిన్న అంశంలో కూడా, ప్రతి చిన్న క్షణంలో కూడా, ఓ రెప్పపాటు లోనే తోస్తుంది అది. దానికేమీ ఎంతో సమయం పట్టదు. అర్థమైందా అండీ.
       మా చిన్నప్పుడు... ఏమంటారు వాటిని? కూల్‌ డ్రింకులు క్రొత్తగా వచ్చిన కాలం. అంటే నాకు ఐదారేళ్ళ వయస్సు వున్నప్పుడు. అదొక వింత. అప్పుడు. మన సంస్కృతిలో అవి లేవు అప్పటికి. మహా అయితే గోళీ సోడాలే వున్నాయి కానీ కూల్‌ డ్రింకు లేదు. అది కొత్తగా కూల్‌డ్రింకులు వచ్చిన కాలం. ప్రపంచంలో అందరూ కూల్‌ డ్రింకులు తాగుతుంటే మూతలు పారేస్తారు కదా, అప్పుడా మూతలకు విలువలేదు. సో ఆ మూతలతోటి ఆడేవాళ్ళము. ఆడితే ఎవరెన్ని ఎక్కువ మూతలు గెలిచారు? అర్థమైందా అండీ? సరే! ఒక వెకేషన్‌ ఆడాము. ఒక వెకేషన్‌ ఆడితే ఒక మూట మూతలు అయినాయి. మానాన్నగారు చూశారు. ఏమిటీ గోలా? గమనించారు. ఏంట్రా అంటే ఇదుగో ఈ మూట మూతలు సంపాదించా అన్నాను. అబ్బా! చాలా బాగా సంపాదించావే! ఇప్పుడీ మూతలను ఏం చేస్తావు? అన్నారు, ఏం చేయడమేమిటి బోల్లెడు కష్టపడి సంపాదించాను. చాలా గంటలు కష్టపడి ఆడితే కదా వచ్చినాయి అవి. అంతేనా కాదా? ఆహా!  ఈ మూతల విలువెంతా? మూతల విలువ నా శ్రమ. బోల్డు కష్టపడితే కదా ఆడింది. ఓహో! అలాగా! అని ఆ మూతలు అలాగే తీసుకెళ్ళి కాలువలో పడేశారు. ఎందుకు ఈయన ఇలా చేశారు? నేనేమీ ఏడవలేదు. దుఃఖించలేదు. ప్రశ్నవచ్చింది నాకప్పుడు. అరె, నేను ఇన్ని నెలలపాటు ఆడి ఇన్ని మూతలు సంపాదిస్తే ఈయన ఒక్క క్షణంలో తీసుకుపోయి ఏం చేశారు? కాలువలో పారేశారు. Why? అంటే నేనెక్కడో ఈ మూతతోటి బంధం పెరిగిపోయిందన్నమాట, అనురాగ బంధం పెరిగిపోయింది. నా మూతలన్నీ తీసుకెళ్ళి, నేను సంపాదించిన మూతలన్నీ తీసుకెళ్ళి కాలువలో పడేశారు, అయ్యో! నాకష్టమంతా బూడిదపాలైపోయింది. ఇంకా మళ్ళా ఎప్పుడూ జీవితంలో ఈ మూతలు సంపాదించను. ఈ మూతల్లో ఏమీ లేదని అర్థమైపోయింది.
ఇప్పుడు ఏమీ లేదు అని తెలియచెప్పడానికి ఉపయోగపడిందా లేదా? ఆ సంఘటన? అదే దాన్ని మనం రివర్స్‌లో తీసుకుంటే ఏమైంది? ఇంకా ప్రమాదం వచ్చేసేది. అర్థమైందా అండీ! ఇట్లా ఒక్కొక్క చోట మనకిప్పుడు దైవం ఏదో ఒక రూపంలో బోధిస్తున్నారా? లేదా? ఆయన ఆరోజు ఆపని చేసి వుండకపోయుంటే? నేను అందులోనుంచి బయటపడక పోయుండే వాడినేమో? ఒక నెలా రెండు నెలల పాటు. అంతేనా కాదా? మరి అప్పుడు సమయం అంతా వృధా అయిపోలే? ఇంటినిండా మూతలే వుండి పోయేవి. ప్రమాదం ఒకటి మళ్లీ వాటి వల్ల. అర్థమైందా?
ఇలాగే మేం సమిష్టి కుటుంబం అన్నమాట. నా వయసు చదువుకునే పిల్లలు ఎవరూ లేరు. అందరూ పెద్దవాళ్ళే. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అందరూ ఏం చేసేవాళ్లు? గవ్వలాటో, అష్టాచమ్మ ఆటో మధ్యాహ్నం పూట ఆడేవారు. ఈ చింతపిక్కలతోటి. వాళ్ళందరూ ఆడుతూ వుంటే నేను చూస్తూ వుండే వాడిని. మొదట్లో ఆడేవాడిని కాదు. ఎందుకని అంతకు ముందు ఈ పాఠం (మూతల పాఠం) వచ్చింది కదా! సరే చూస్తూ వుండేవాడిని చూస్తూ వుంటే కొంతకాలం తర్వాత ఆటోమేటిక్‌ గా ఏమౌతాం? మనకు అర్థమైపోతుంది కదా! వాడు ఎట్లా ఆడుతున్నాడో? మనకు తెలివితేటలు పెరిగిపోతాయి, దాన్ని అట్లా కాదు, దీన్నిట్లా, దీన్నిట్లా అని సలహాలు చెప్తుంటే, నువ్వు ఆడవోయి వచ్చి తెలుస్తుంది అంటారు వాళ్ళు. అంతేనా కాదా? ఇక వాళ్ళతో కూర్చుని ఆడేవాడిని. వెకేషనే కదా ఎట్లాగు? ఆడేవాడిని. ఒకరోజు ఇది గమనించారు. వీడు మళ్ళా మూతలు పోయి దేంట్లో మునిగిపోయాడు? గవ్వలాటలోను, అష్టాచమ్మలోను మునిగిపోయాడు.
ఓరినీ, వీడిని ఎట్లాగొట్లా మళ్ళా బయట పడవేయాలనుకున్నారు. నువ్వు రోజుకొక పుస్తకం చదివి, నాకు చెప్పగలిగితే అప్పుడు నీవు చేసేపనులు ఏవైనా నేను ఒప్పుకుంటాను అన్నారు. ఈ రెండిట్లో ఏది Important ఇప్పుడు? పుస్తకం చదవడమే ఇంపార్టెంటు.
అక్కడ బీరువాడు పుస్తకాలున్నాయి. ఎన్ని చూపెట్టారు? బీరువాడు పుస్తకాలు. చదువు. నీకు శక్తి వుందంటున్నావు కదా, తెలివితేటలు వున్నాయి అంటున్నావు కదా, చదువు. రోజుకో పుస్తకం చదవాలి. ఛాలెంజ్‌ అదన్నమాట. Okay, I take your Challenge. పుస్తకాలు చదివే కొద్దీ ఇప్పుడేమైపోయింది? జ్ఞానం పెరిగిందా పెరగలేదా? పెరిగితే గవ్వలాట ఏమైపోయిందప్పుడూ? హీనమైపోయింది. వదిలిపోయిందది నన్ను. అదే ఆరోజు ఆ Task ఇచ్చి వుండకపోతే, నేను ఏమయ్యి వుండేవాడిని? గవ్వలాటలో మునిగిపోయేవాడిని.
ü కాబట్టి ఇప్పుడు భగవంతుడు మళ్ళా సహాయం చేశాడా లేదా?
ఇప్పుడు నేనే సాధించాను అనుకున్నచోట ఏమైపోయావ్‌? ప్రజ్ఞ శూన్యమైపోయింది. చైతన్యం పరిమితమై పోయింది. బలహీనమైపోయింది, అశక్తమైపోయింది. అదే భగవంతుడు అనుకోగానే, సర్వవ్యాపకమైంది. బలవత్తరమైంది. ఎంతటి సమస్యనైనా సరే పరిష్కరించగలిగే సమర్థతను సంపాదించింది. ఆ పోరాట పటిమనిచ్చింది. అధిగమించగలిగే శక్తినిచ్చింది. అర్థమైందా? కాబట్టి నిన్నునువ్వు తొలగించుకుంటూ రా. ఆ స్థానంలో ఎవరిని పెట్టాలి? ఈశ్వరుడిని పెట్టాలి. ఈ ఆదేశం ఈశ్వరుడిచ్చాడు. చేసేస్తాను. అప్పుడేమై పోతావ్‌? ఆ... అర్థమైందా అండీ?
       సముద్రాన్ని లంఘించేటప్పుడు హనుమంతుని స్వరూపం వుంటుందండి. అది రామాయణంలో ఒక గొప్ప వర్ణన. ఆ అద్భుతమైన వర్ణనని కనుక మనం దృశ్యంగా కనుక దర్శించగలిగితే, జీవితానికి అద్భుతంగా వుపయోగపడుతుంది.
వారి పాద ఘట్టనకి, ఆ మహేంద్రగిరి పర్వతం సముద్రంలోకి కృంగిపోతుంది. ఆ లేచినప్పుడు ఒక తోపుతో ఆ గిరి పర్వతాన్ని తన్ని లేస్తారన్నమాట వారు. ఎంతటి శక్తివంతుడో దాన్ని బట్టి ఆలోచించండి. ఒక తన్నుకు సముద్రంలోపలికి వెళ్ళిపోతుంది పర్వతం. అంత శక్తివంతుడు కాబట్టే ఒక్క లంఘనంలో నూరు యోజనాల విస్తీర్ణాన్ని దాటగలిగినటువంటి అద్భుతమైనటువంటి దర్శనం.
రామాయణ మహాకావ్యాన్ని చదివినప్పుడు ఈ దర్శనాన్ని ఎవరైతే పొందుతారో, వారికి తనలో వున్నటువంటి ప్రాణశక్తి స్వాధీనమైపోతుంది. ఆ హనుమత్‌ స్వరూపము, నీ ప్రాణశక్తి రెండూ ఒక్కటే. రెండూ వేరు వేరు కాదు. ఎవరికైతే హనుమద్దర్శనం సాధ్యమౌతుందో, వారు ప్రయత్నించి యోగం నేర్చుకోనక్కర లేదు, సహజమైన యోగ సిద్ధి కలుగుతుంది. అందుకనే రామాయణం చదువమంటారు అందరిని.
       ఎవరైతే భారతం చదువుతారో, ఎవరికైతే ఆ భారతం చదవడం వల్ల ధర్మరాజు యొక్క ధర్మం, భీష్ముని యొక్క ఔదార్యం ఈ రెండూ దర్శనానికి రావాలి. చాలా గొప్పగా చిత్రించబడ్డాయి అవి. ధర్మరాజు దృష్ట్యా భారతాన్ని చదవండి, అలాగే భీష్ముని యొక్క ఔదార్యం, ఎన్నోతరాలు అతని ముందు గడచిపోతూ వుంటాయి. దైవాంశ సంభూతుడే, కానీ కర్మవశం చేత ఎట్లా వుండిపోవలసి వచ్చిందో, ఎంతటి నిష్ఠాగరిష్ఠుడైనప్పటికీ, ఎంతటి సమర్థుడైనప్పటికీ, పరశురాముడిని గెలిచినంతటి మహానుభావుడైనప్పటికీ కూడా కర్మవశానికి ఎట్లా లొంగవలసి వచ్చిందో!
       కృష్ణతత్వాన్ని అవగాహన చేసుకోవాలంటే భాగవతం. భాగవతం చదివి కృష్ణ దర్శనాన్ని ఎవరైతే పొందుతారో, విష్ణు దర్శనాన్ని ఎవరైతే పొందుతారో, వాళ్ళకి సర్వవ్యాపక మైనటువంటి స్థితి లభిస్తుంది. అందుకే పురాణేతిహాసాలలో వాటిని అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చిత్రీకరించారు. మీ యొక్క దృష్టికి దర్శనానికి అందేటటువంటి... అతి దగ్గరగా అందించారు.
'దర్శనం' అంటే ఏమిటి?
గాఢనిద్రావస్థలో కూడా మరపుకు రానిదే దర్శనం. గాఢనిద్రావస్థలో కూడా మరపుకు రానిదేదైతే వుంటుందో అది దర్శనం. అలా మనలో ఎన్ని వుంటే అవి అన్నీ మనకు ఉపయోగపడేవే. అర్థమైందా అండి? కాబట్టి ఆ దర్శనం మరణకాలంలో కూడా వుపయోగపడుతుంది.
కాబట్టి జీవితం మొత్తం మీద పరమాత్మను దర్శించాలనేటటువంటి కాంక్ష ఎవరికైతే బలీయంగా వుంటుందో, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనే కాంక్ష బలీయంగా ఎవరికైతే వుంటుందో,
ఎవరికైతే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుందో, వాళ్లకది నిద్రలోకూడా మరపుకు రాదు. మరణంలోకూడా మరపుకు పోదు. దేహం మారినా కూడా ఆ జ్ఞానం నిన్ను విడిచి పెట్టదు.
కాబట్టే మానవుడు తప్పనిసరిగా ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని సాధించాలి. ఆ తురీయానుభూతిని సాధించాలి. ఆ పరమాత్మ దర్శనాన్ని సాధించాలి. యోగదర్శనాలు అనేకం. బాలకృష్ణుని యొక్క రూపం కనపడుతుంది. నారదుని యొక్క దర్శనం కలుగుతుంది. గరుత్మంతుని యొక్క దర్శనం కలుగుతుంది. మహానుభావులైనటువంటి పరమహంసల యొక్క దర్శనం కలుగుతుంది. ఏ యే మహానుభావులతో అయితే నీవు అంతర్ముఖ ప్రయాణంలో సంస్కారయుతంగా సంబంధపడి వుంటావో, అనేక జన్మార్జితమైనటువంటి సాధనాబలంతో, ఆయా మహానుభావుల యొక్క దర్శనం అందరికీ కలుగుతుంది. వారు అశరీర పద్ధతిగా సహాయం చేస్తారు. నీ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి తోడ్పడుతారు. అటువంటి దర్శన ప్రభావం చేత, నీలోని చైతన్యం మార్పు చెందుతుంది. పరిణామం చెందుతుంది. తన మూలాన్ని తాను అన్వేషించే పనిలో పడుతుంది. అప్పుడు చైతన్యరహిత స్థితిని తెలుసుకుంటావు. కాబట్టి అశరీర పద్ధతిలో సద్గురు మూర్తుల సహాయాన్ని అందుకోక పోయినట్లయితే, నీ అంతర్ముఖ ప్రయాణం ఎప్పటికీ పూర్తవ్వదు.
       అంతర్ముఖ అంటే కేవలం కళ్లుమూసుకుని కూర్చుని, ముక్కుమూసుకుని కూర్చుని జపం చేసే జపం కాదది. నీ చైతన్యం తన మూలాన్ని వెతికేటటువంటి పనిలో పడటమే 'అంతర్ముఖం' అంటే. మిగిలినదంతా బహిర్ముఖమే.
అవతారుడైనటువంటి మెహర్‌ బాబా, ఈ సమస్థ జీవనాన్ని నాలుగు దివ్యయానాలుగా విభజించారు. మానవ జీవితమే అసలు ఒక దివ్యయానం. మన ప్రథమ దివ్యయానం.
84 లక్షల జీవరాశులలో మానవోపాధిని ధరించడమే ప్రథమ దివ్యయానం. దైవాన్ని తెలుసుకో గలిగేటటువంటి అర్హత, సమర్థత ఈ రెండూ ఈ (మానవ) ఉపాధిలో వున్నాయి.
మానవోపాధిని ధరించడం ద్వారా మనమందరం ప్రథమ దివ్యయానాన్ని చేస్తున్నాం కానీ ఎదగడం లేదు. రెండవ దివ్య యానం, మూడవ దివ్యయానం ఆఖరి మజిలీ అయినటువంటి చతుర్థ దివ్యయానానికి జన్మరాహిత్య స్థితికి చేరుకునేటటువంటి స్థితికి, ఆ పరమాత్మకి నీకు అభేదమైనటు వంటి స్థితిని సాధించి, పరబ్రహ్మ నిర్ణయానికి స్థిరంగా నిలబడి వుండేటటువంటి నాల్గొవ దివ్యయానంలో నిలబడి వుండగలగడమే జన్మరాహిత్యం. మరి అంతటి సమర్థత ఒక్క ఈ మానవ దేహంలోనే వున్నది. కానీ మనం రోజువారీ జీవితంలో దేనికి సంతృప్తి చెందుతున్నాం? దేనికి అసంతృప్తి చెందుతున్నాం. అలోచించి చూడండి. ఇవాళ రోజువారీ జీవితంలో, నా సంతృప్తి అసంతృప్తి దేనికి కలిగినాయని వెనక్కి తిరిగి చూస్తే, అత్యంత అల్పమైనటువంటి అంశాలకి మనం సంతృప్తి, అసంతృప్తి పొందుతున్నాం అవునా? కాదా? ఒకరు మనతో మాట్లాడారంటే సంతృప్తో, అసంతృప్తో. మాట్లాడలేదన్నా సంతృప్తో, అసంతృప్తో. ఇంత చిన్న విషయాలకే, ఈ జ్ఞానేంద్రియాలతో కూడినటువంటి, అల్పమైనటు వంటి విషయాలకే, సంతృప్తి, అసంతృప్తి మూటకడుతూ వుంటే మనం కర్మను దాటకలుగుతామా? కర్మపరిధిని అతిక్రమించ గలుగుతామా? మరి ఆ భగవద్దర్శనాన్ని అందుకోగలుగుతామా?
ఆ యోగ దర్శనాన్ని అందుకోకలుగుతామా? ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని అందుకో గలుగుతామా? మనం అందుకోవలసినటువంటి గమ్యాన్ని నిరంతరాయంగా ఎవరైతే నిలుపుకుంటారో, వాళ్లు మాత్రమే ఆస్థితికి పరిణామం చెందుతారు. కాబట్టి ప్రతిఒక్కరూ దానికోసం ప్రయత్నం చేయాలి.
       మీరేదో అయాచితంగా తెచ్చుకోలేదు ఈ మానవ ఉపాధిని, ఎంతో కష్టపడి సంపాదించారు. కాకపోతే, ఆ కష్టం అంతా మీకు గుర్తులేదు అంతే. 84 లక్షల జీవరాశులలో పుట్టి పోయి, పుట్టి పోయి, పుట్టి పోయి.........    
ఎన్ని లక్షల సంవత్సరాలు గడచిపోయిందో? అవునా? కాదా?
ఎన్నోమాతృ గర్భాలలో మనం ఆ గర్భవాసపు నరకాన్ని అనుభవించి, నీవు మరలా జన్మించి, ఇప్పుడు అనుభవిస్తున్న సుఖదుఃఖాల మూటనంతా మోసుకుంటూ, అదే పాప పుణ్యాల రాశిలో తిరుగుతూ, మరలా జన్మను పొందుతూ, వచ్చే జన్మకు ఏ రకమైన జన్మను పొందుతాము? ఇదే మానవ ఉపాధి కలుగుతుంది అనేటటువంటి గ్యారెంటీ వుందా? చెప్పగలమా? ఇదే విజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలమా? మరి ఈ విజ్ఞానాన్ని సద్వినియోగం చేశామా? ఈ ప్రథమ దివ్య యానం ఏదైతే  భగవంతుడి చేత నీకు అనుగ్రహించ బడిందో, ఆ వరాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? కేవలం ప్రాపంచికమైనటువంటి అంశాలమీదనే మనం దృష్టి పెడుతున్నాం.
ఎందుకు మాటికి, మాటికి ప్రపంచం అని అంటుంటారండీ? వై ఇట్‌ ఈజ్‌ ప్రపంచం? ఐదైదులు ఇరవైయైదు తత్వాలతో కలిసి నిర్మితమైందని ఒక ఆలోచన. ఒక సాంఖ్య దర్శన సూత్రం ప్రకారంఐదైదులు ఇరవైయైదు అంశాలు కలిసి ఏర్పడినది అని అర్థం. ఇంకొకటి ఏమిటి? అదే పంచీకరణం ఏమని చెప్తుంది? ఇది కొద్ది కాలంలోనే నశించిపోయేది నాయనా! అని చెప్తున్నది. కాలవశిష్ఠంగా ఇది నశించి పోతుంది. ఇది శాశ్వతం కాదు. ఏదైతో విభజించ బడుతున్నదో అది ఎప్పటికీ శాశ్వతం కాదు. ఈ సృష్టియందు విభజించబడనటువంటి అంశమే లేదు. పరమాత్మ తప్ప. అర్థమైందా అండీ? కాబట్టి, దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ. ఒకే ఆత్మయే దేహం నేనుగా వున్నప్పుడు దేహాత్మగా వున్నది, అదే అంతర్ముఖ ప్రయాణం చేస్తూ చైతన్యం తన మూలాన్ని వెతికేపనిలో పడింది. అప్పుడు అంతరాత్మగా వుంది. అర్థమైందా అండీ? అంతర్యామి అప్పుడు. అదే అన్నటికి ఆవల వున్నటువంటి పరమాత్మగా వుంది. అప్పుడు పరమాత్మగా పరబ్రహ్మముగా వున్నది. మరి ఒకే నేను ఈ మూడు స్థాయిలలో వున్నదని చెప్పడం కోసమే, ఆ మూడుమాటలనీ ప్రయోగించారు.
వాస్తవానికి ఈ దేహాత్మ, అంతరాత్మ ఆ పరమాత్మలో అంశీభూతములు కావా? అంశీభూతములే, కాకుండా ఎలా పోయినాయి? అవునా, కాదా? కానీ స్థూలమైన ఆవరణ భేదం చేత, సూక్ష్మమైనటువంటి ఆవరణ భేదం చేత, ఈ రెండూ వేరు వేరుగా వున్నాయనేటువంటి భావన కలుగుతుంది.  కాబట్టి భావమే బంధము. ఇంకేం లేదు. నీవు ఆ భావాతీత స్థితిలోకి గనుక చేరుకున్నట్లయితే, ఆ అభావ స్థితిలో నిలబడినట్లయితే, భావతీతం అనే స్థితి వేరు, అభావం అనే స్థితి వేరు. గాఢ నిద్రావస్థలో నీవు అభావంగా వున్నావు. అర్థమైందా అండీ? భావాతీతంగా లేవు. అభావంగా వున్నావు. అయితే ఎప్పుడు అభావం అనవలసి వస్తుందంటే, నీకు ఆ ఎరుక వుంటే. నువ్వు ఎలా వున్నావో నీకు తెలిస్తే అభావం. కానీ మనకు తెలుస్తుందా? తెలియడం లేదు కదా! కాబట్టి ఆ తెలియక పోవటం వల్ల ఆ అభావాన్ని మెలకువలో వినియోగించుకోలేక పోతున్నాము. తెలిస్తే దానిని ఇక్కడ వినియోగించుకుంటాం. అప్పుడు సమస్య తొందరగా పరిష్కారమై పోతుంది. కాబట్టి మెలకువ, కల, నిద్ర కేవలము శరీర ప్రాణ మనో బుద్ధులకే కానీ, నాకు కాదు. అవస్థాత్రయం నాకు కాదు అన్నటువంటి స్థితి సాధించినప్పుడు మాత్రమే, అప్పుడు సమస్య తొందరగా పరిష్కారమైపోతుంది. అర్థమైందా అండీ? కాబట్టి మెలకువ, కల, నిద్ర కేవలము శరీర ప్రాణ మనో బుద్ధులకే కానీ, నాకు కాదు. అవస్థాత్రయం నాకు కాదనేటటువంటి సాక్షిత్వాన్ని సాధించినప్పుడు మాత్రమే, నీవు ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి అర్హత సంపాదిస్తావు. అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. అర్థమైందా అండీ?
కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవస్థాత్రయ సాక్షిత్వం మీద దృష్టి పెట్టాలి. దానికి అడ్డంకిగా వున్న ఏ భావాన్నైనా సరే తోసిరాజనాలి. ఏ భావాన్నైనా కూడా నిరసించగలగాలి. ఏ పరిమితినైనా నిరసించగలగాలి. ఏ పరిణామాన్నైనా కాదనుకోగలగాలి. ఎంతటి సుఖదుఃఖాలనైనా సరే త్యజించగలగాలి. ఎంతటి విలువైనదైనా సరే, దాని ముందు ఎందుకు కొరగాదు. అర్థమైందా?
       మీ ఇంట్లో ఎవరైనా గానీ కోటి రూపాయిలు పెట్టారనుకోండి? మిమ్మల్ని హాయిగా నిద్రపోమన్నారు అనుకోండి. ఏం చేస్తారు? కుదరదా? ? కోటి రూపాయిలు మీరు ఏమన్నా మోస్తున్నారా? లేదు కదా? ఇంట్లో పెట్టారు, మీ వస్తువులతో సమానంగా పెట్టారు, అంతేకదా? ఎందుకు మరి? మనకు నిద్ర రావటం లేదు. కోటికి విలువిచ్చి మనం భావంలో మోశాము దానిని. మోసేటప్పటికి ఏమైందీ? మీ ఇంటి చుట్టూ వంద మంది పోలీసులను కాపలా పెట్టాం. ఆ కోటి ఎవరు ఎత్తుకు వెళ్ళకుండా. అప్పుడు నిద్రపోగలరా?
       కష్టమా? ? చూడండి! ఇంత చిన్న విషయమే మన నిద్రను చరుస్తుందే, ఆలోచించి చూడండి, మరి రేపొద్దున బ్రహ్మానుభూతియందు నీకు భువనైక మోహన సామ్రాజ్యాన్ని ఇస్తానంటారు, ఈ ప్రపంచం మొత్తం నీదేనయ్యా! నువ్వు ఏం చెబితే అది జరుగుతుంది ఈ సృష్టిలో. ఈ చక్రవర్తిత్వాన్ని తీసుకో, ఈ భువనానికి మొత్తానికి నువ్వే కింగ్‌. 14 భువనాలలో ఒక భువనం నీకిచ్చేస్తాం పో. ఒక లోకమే నీకిచ్చేస్తాం.
"లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది, అలోకంబగు పెంజీకటి" నీ లక్ష్యం అది. కానీ మధ్యలో ఎన్నిదాటాలో చెబుతున్నాడక్కడ. ఆ లోకంబులేమిటో దాటాలి, ఆ లోకేశులేమిటో తెలియదాటాలి. లోకస్థులు ఎవరో తెలిసి దాటాలి. తెగినతుది- అవన్నీ ఎట్లా తెగిపోతాయో తెలియాలి. అలోకమైనటువంటి పెంజీకటి ఎలా వుందో కూడా తెలియాలి. అవ్వల- దాని అవతలకి చేరాలి. ఎలా వెలుగుతున్నాడట ఆయన? ఏకాకృతిన వెలిగెడి .... అర్థమైందా అండీ? వాడు పరమాత్మ. ఇప్పుడు మరి పరమాత్మను ఈజీగా దర్శించివేయచ్చా? మనం అందరం ఏమనుకుంటున్నాము? గుడి వెళ్ళేసి, నాలుగు మూరలు పూలమాలలు వేసేసి, నాలుగు టెంకాయలు కొట్టేసి, నాలుగు అరటిపళ్ళు ఇచ్చేసి, నాయనా రాత్రికల్లా నువ్వు కనబడేస్తే, తెల్లారేప్పటికల్లా మోక్షం వచ్చేస్తే, ఏ గొడవా లేదు. కదా!
Is it so easy? Not so!
"లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది,
అలోకంబగు పెంజీకటి కవ్వల ఏకాకృతిన వెలిగెడు"
వాడిని పట్టుకోమంటున్నారు. అందుకే భాగవతం చదవమనేది. ఎవరికైతే భాగవత పద్యాలు, కంఠస్తంగా నోటికి వస్తాయో? వాడికి వెంటనే స్ఫురిస్తుంది. ఆ జ్ఞానం. అర్థమైందా అండీ?
"ఎవ్వని చే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై" అన్నీ ప్రశ్నలే. ఆ ప్రశ్నలకు ఎవరికైతే సమాధానం తెలుస్తుందో వాడు జ్ఞాని. వాడు భగవద్దర్శనాన్ని పొందినవాడు. మాటల్తో చెప్పటం కాదు, "ఎవ్వని చే జనించు జగము"- స్పష్టంగా, దర్శనంగా తెలియాలి. "యెవ్వని యందుండు లీనమై"- ఎలా వుందో తెలియాలి. ఆయన అన్నీ ప్రశ్నలే వేశాడు. అర్థమైందా అండీ? అట్టి వానిని నేను శరణు జొచ్చుచున్నాను అని చివరికి చెప్పాడు. అదిట శరణుజొచ్చటం అంటే. మనం కూడా శరణుజొచ్చామని అనుకుంటున్నామా? లేదా?
       ఇప్పుడేగా చదివారు 'ప్రాతఃస్మరామి' అంటున్నారా? లేదా? అదే కదా 'శరణాగతి' అంటే? సరిపోతుందా? ఈ శరణాగతి? ఎంత కావాలటా? నిన్ను నీవే 'సున్నా' చేసుకునేటంత కావాలట. కాబట్టి ఏ జ్ఞానంవలన  అయితే ఇవన్నీ తెలుస్తాయో? ఆ జ్ఞానాన్ని పొందాలి. సిద్ధింపచేసుకోవాలి. ఆ జ్ఞానసిద్ధి కలగాలి. ఆ జ్ఞానసిద్ధి చేత ఏ అహమైతే నిలబడిందో, దాన్ని లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నటువంటి నామరూపాత్మకమైనటు వంటి ఈ అహం, ఎంతసేపు వుంటుందండీ? పాత్రోచితమైన అహం ఇది. అవునా? కాదా? ఈ అమ్మాయి ఎప్పటికీ 8వ క్లాసులోనే వుంటుందా? ఎందుకుంటుంది? అడగండి ఆ అమ్మాయినే. ఆ.. నేను ఇంకా మహా వుంటే, రేపు పరీక్షలు రాసేదాకా వుంటాను, తరువాత అయిపోతే 9వ క్లాసు. అంతేనా కాదా? కాబట్టి మీరెక్కడ ఏ పాత్రలోను శాశ్వతంగా వుండరు. కానీ ఆ పాత్ర మిమ్మల్ని ఆవేశించేస్తుంది. ఏమైందప్పుడు? ఏమౌతుందంటే?
       అత్యాశ కలిగిన వాడట భగవంతుడు సాక్షాత్కరిస్తే పరుశవేదిని అడిగాడట. అత్యాశ కలిగిన వాడు ఏం చేశాడు? ఓ వరం కోరుకోవయ్యా అంటే 'పరుశవేది' ని అడిగాడట. పరుశవేది అంటే ఏమిటి? ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. సరే ఆకలేసిందని అన్నాన్ని ముట్టుకున్నాడు. ఏమైంది? బంగారమైంది. మంచినీళ్ళాన్నా తాగుదామని మంచినీళ్ళు ముట్టుకున్నాడు. బంగారమైపోయింది. ఇప్పుడు ఏ మవ్వాలి వాడు? అది వరమా? శాపమా? శాపం. మన పరిస్థితి కూడా అదే. పుడుతూనే మనం జ్ఞానంతోనే పుట్టాం. మానవదేహాన్ని ధరించడంతోనే జ్ఞానంతోనే పుట్టాం. కానీ సమస్య ఏమిటి? జ్ఞానం మరుగున పడిపోయింది. ఆ జ్ఞానం దేని మరుగున అయితే పడిపోయిందో దాన్ని వెలికి తీయడమే సాధనంటే. దాని పైనున్న కవర్‌ బాగా తీసేస్తే, స్వచ్ఛమైనటు వంటి స్పష్టమైనటువంటి, ఆ జ్ఞానం మీకే బోధపడుతుంది. కాబట్టి, "ఉద్ధరేత్‌ ఆత్మ నాత్మానం ఆత్మానం అవసాధయేత్‌".
ఎప్పటికైనా ఆ ఆత్మస్వరూపాన్ని మనం అందుకుని తీరవలసినదే. అటువంటి తీవ్రమోక్షేచ్ఛ మనలో వుండాలి. అది చాలా ముఖ్యం. ఈ తీవ్రమోక్షేచ్ఛ వున్నటువంటి వాడికి, మీరందరూ ఇందాక అంటున్నారు కదా, ఏమిటది? "ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురు పాదుకామ్‌" - అన్నప్పుడు మీ ప్రాణమనస్సులు పనిచేస్తున్నాయా? ప్రాణమనస్సులు పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయా? పనిచేయట్లేదా? ప్రాణం పనిచేస్తుందిగా? మనసుకూడా పనిచేస్తున్నట్లేగా, ప్రాణం పనిచేస్తున్నంత వరకూ మనసుకూడా పనిచేస్తున్నట్లే. కరెక్ట్‌ లాజిక్‌ అది. సో ప్రాణమనస్సులు పనిచేస్తున్నాయంటే, ఒకటి పనిచేస్తే రెండవది పనిచేస్తుంది. కానీ ఎవరైతే సర్వస్య శరణాగత స్థితి అనుభూతమొనర్చుకున్నారో, వారికి ప్రాణమనస్సులు పనిచేయవు. ఎప్పుడూ పనిచేయవు. ఎప్పుడూ పనిచేయకుండా ఎలా వ్యవహరిస్తారండీ? అభావముగా వుండి వ్యవహరిస్తాడు.
గాఢ నిద్రావస్థయందు మునిగియున్నప్పుడు ఇంద్రియములు ఎలా వున్నాయో, వ్యవహరించుతున్న కాలంలో కూడా అలాగే వుంటాడు. ప్రాణం పనిచేస్తూనే వుంటుంది.
కానీ దాని ప్రభావం ఏమైపోతూవుంటుందంటే కేవలం శారీరకమైనటు వంటి ఉనికిని కాపాడటానికి అవసరమైనంతే పనిచేస్తుంది. ప్రభావశీలంగా పనిచేయదు. అలా అత్యంత మందవేగంతో ప్రాణ, మనస్సులు హీనమైపోయి, క్షీణించి పనిచేస్తాయి. అప్పుడు ఏమైంది దానివల్ల? నీ ప్రాణశక్తి, ఈ మానసిక శక్తి మీ లోపల వున్నటువంటి గుణబలాన్ని, స్మృతి బలాన్ని, వాసనా బలాన్ని (వాటిని) వేగాన్ని అందించకుండా చేస్తాయి. ఇవి రెండు అందకపోతే అవి ఏం చేయలేవు మిమ్మల్ని. ఎందుకు అలా చేయాలి? అసలు? ఏదైనా ఈ సృష్టిలో వినియోగించకుండా వుంటే క్షీణించిపోతుంది. అదే ఈ సృష్టి ధర్మం.
దానికే భగవాన్‌ రమణులు ఏం చెప్పారంటే- ''గాలి కొట్టకు, కట్టెలు వేయకు''. యాజ్‌ సింపుల్‌ యాజ్‌ ఇట్‌. ''గాలి కొట్టకు, కట్టెలు వేయకు''- అంటే అర్థం ఏమిటి? మనలోపల నిరంతరాయంగా వాసనాత్రయంతో కూడినటువంటి అగ్ని జ్వలిస్తుంది. అహంకారమనే అగ్ని జ్వలిస్తుంది. దాంటో ఆ అగ్ని మండాలి అంటే ఏం కావాలి? 'విషయాలు' అనే కట్టెలు పడుతూ వుండాలి దానిలో. ఆపేస్తే? వున్నకట్టెలేవో అవే మండి బూడిదైపోతాయి. కొత్త కట్టెలు వేయకు. అప్పుడు అసలు అగ్ని మండాలి అంటే ఏ ఆధారం వుండాలి? ప్రాణాధారం వుండాలి. ప్రాణశక్తి అందినంతవరకు కూడా అదేం చేస్తుంది? జ్వలిస్తూనే వుంటుంది. కాబట్టి సులభ సూత్రం ఏమిటి? ''గాలి కొట్టకు, కట్టెలు వేయకు''. కట్టెలు అంటే విషయాలు. కొత్త సంస్కారాలను ప్రోగుచేసుకోకూడదు, పాత సంస్కారాలు అవే రద్దయిపోతాయి. అర్థమైందా అండీ? శేషించినవాడు ఎవడు? నేనే. ఆ శేషించిన వాడెవడు? నేనే. మరి ప్రస్తుతం కనపడుతున్న నేను ఎవరు? ఏ స్మృతి బలంలో, ఏ పాత్రోచితమైనటువంటి బలంలో ఎవరు కనపడితే వాడు. చిన్నప్పుడు అమ్మాయి, పెద్దైతే అమ్మ, ఇంకొంచెం పెద్దైతే అమ్మమ్మ. ఇంకొద్దిగా పెద్దైతే నిర్మలగారి లాగా. ఇంకొద్దిగా పెద్దైతే ప్రమీల గారి లాగా. ఇంకొద్దిగా పెద్దైతే? ఇంకో శరీరంలో. అర్థం అయ్యిందా? అంతేనా కాదా? మరి ఇవన్నీ మనం ఒకటి గానే వున్నామా? వేరు వేరుగా వున్నామా? ఇవన్నీ నేనే కదా! వేరు వేరా? కానీ, వ్యవహారభేదంలోకి వచ్చేప్పటికి ఏమైపోయావ్‌? ఇవన్నీ వేరువేరుగా భావిస్తున్నావ్‌. భావించి జ్ఞానం పరిమితించ బడింది. అర్థమైందా? ఎప్పుడూ నువ్వు దైవీ స్ఫురణలో, దైవీ స్థితిలో నిలబడి ఈ పాత్రోచిత ధర్మాలు నిర్వహించలేవా? సాధ్యం కాదా? సాధ్యమేనా? నేను దైవాన్ని అనుకుంటే భోజనం చేయలేవా? నేను దైవాన్ని అనుకుని నిద్రపోలేవా? నేను దైవాన్ని అనుకుని మాట్లాడలేవా? ఇవేవీ అసాధ్యం కావే? అది ఋషిప్రోక్తమైన జీవితం అంటే. మన మహర్షులు అందించిన జీవన విధానం ఏమిటంటే?
నేను దైవాన్ని. అనుకుని చేయి అన్నీ. అప్పుడేమయ్యింది? దైవమే అవుతావు.
ఎలా? 'యద్భావం తద్భవతి'. అందరికీ మీకు సూత్రాలు బాగా తెలుసు. కాకపోతే ఆచరణ లేదు. అంతేనా కాదా? అందుకని మీరేమి చేయాలి? బాగా మిమ్మల్ని మీరు తొలగించుకోవాలి. మిమ్మల్ని మీరు తొలగించుకోవాలి. మీలో వున్న ప్రత్యేకతలను తొలగించుకోవాలి. ఇంకా సాధ్యమైనంత వరకూ ప్రాణవేగాన్ని, మనోవేగాన్ని నియంత్రించి స్వాధీనపరచుకోవాలి. మీకు ఎందులో బలం వుంటే అందులో. కొంతమందికి మనోనిగ్రహోపాయం సులభం. కొంతమందికి ప్రాణ నిగ్రహోపాయం సులభం. బలవంతముగా ఏ పని చేసినా ప్రయోజనము లేదు. ఈ రెండిటిని బలవంతముగా ఎవరూ కట్టలేరు. పరిష్కరించాలండీ ఎప్పుడైనా సరే. విషయాన్ని గానీ, సమస్యని గానీ, పోరాటాన్ని గానీ, ప్రత్యేకతని గానీ పరిష్కరించాలి. ఎందువల్ల నాకిది ప్రత్యేకం? ఎందుకు నేనసలు దీనిని ప్రత్యేకం అనుకుంటున్నాను? అక్కడ నా అజ్ఞానం వుంది. దాన్ని పోగొడితే? ఇంక అప్పుడది ప్రత్యేకం కాదన్నమాట. సామాన్యం అయిపోయింది. ఏ సామన్యము నిన్ను బంధింపజాలదు. బంధిస్తుందా నిన్ను సామాన్యం? అదెప్పటికీ నిన్ను బంధించదండీ. కాబట్టి మీ జీవన విధానంలో నిరంతరాయంగా ఈ 'విచారణ' అనేటువంటి ఆయుధాన్ని, జ్ఞాన వైరాగ్యాలు అనే ఆయుధాన్ని, బాగా వినియోగించాలి. అనుక్షణం వినియోగించాలి.
ఆ తీవ్రమోక్షేచ్ఛ స్థిరపడిపోయి ''ఈ జన్మలోనే నేను ముక్తిని సాధించి తీరవలసిందే''. పరమహంస అంటారు- భగవంతుడి కోసం ఎప్పుడైనా ఏడ్చావా’’? ఈ ప్రపంచంలో కనపించే వస్తువుల కోసం, ఆటబొమ్మల కోసం, పుస్తకాల కోసం, విషయాల కోసం, సినిమాల కోసం, రకరకాలైనటువంటి దృగ్విషయాల కోసం, రకరకాలైనటు వంటి పెరిశబుల్‌, అశాశ్వతమైనటువంటి అంశాల కోసం దుఃఖించిన సందర్భాలు జీవితంలో చాలా వున్నాయా? లేవా?
ఏ ఒక్కరోజైనా భగవంతుని దర్శనం కోసం పరితాపము చెందావా? ఏనాడు నీవు ప్రాణాన్ని వదలడానికి సిద్ధపడేటంత పరితాపం చెందుతావో, తత్‌ క్షణమే భగవత్‌ దర్శనము సాధ్యము. ఎంత సమయం పడుతుంది అని అడిగాడు, నాలాంటి వాడు ఒకాయన. ఏమండీ! భగవంతుడిని చూడాలంటే ఎంత టైం పడుతుంది? నీ ప్రాణములు వదిలేటంత –
ఇక భగవంతుడిని చూడక జీవించ జాలను అను ప్రాణములను వదిలేటంత పరితాపము
ఏ క్షణము కలుగుతుందో, తత్‌క్షణమే నీకు భగవద్దర్శనము కలుగుతుంది.
ఇప్పుడు ఆ పరిణామం, ఆ పరిపక్వత వస్తే ఇప్పుడే. లేదండీ ఒక వెయ్యి, పదివేలు, లక్ష, పదికోట్ల సంవత్సరాల తరువాత రావచ్చండి అనంటే? 'లెట్‌ ఇట్‌ బీ' అప్పటికే. అంతేకదా!
ఆయనకేం మన సంవత్సరాలతో లెక్కలేదు. మన కాలగమనం వేరు, ఆ బ్రహ్మాండ కాలగమనం వేరు. పితృదేవతల కాలగమనంలోనే మనకొక సంవత్సరమైతే వాళ్ళకు ఒకరోజు. మరి ఆ పితృదేవతలకు ఆధారభూతమైనటువంటి, పంచతన్మాత్రలకు అధిష్ఠాన మైనటువంటి పంచబ్రహ్మలు, పంచశక్తులు, వాళ్ళ యొక్క కాలమానంలో మన సంవత్సరాలు అక్కడ రెప్పపాటుతో సమానం. అర్థమైందా అండీ? కాబట్టి నేనేదో పదేళ్ళు చేశానండీ, పన్నెండేండ్లు చేశానండీ, 20 ఏళ్ళు చేశానండీ, 50 ఏళ్ళు చేశానండీ
 అని మన కాలమానంలో మనం చెప్పుకునే లెక్క, దైవానికి సంబంధించిన కాలమానంలో అవన్నీకూడా నిముషాలతో సమానం.
కాబట్టి ఇప్పుడు మనమందరం ఏమనుకుంటాం? "అబ్బా! ఆవిడ 80 ఏళ్ళు జీవించారండీ"- అని అంటున్నామా? లేదా? ఆ కాలమానంలో చూస్తే? 80 మినిట్స్‌. ఓహో! అలాగా, అంటారు వాళ్ళు అంతే. పెద్ద విషయమేమి వుందండీ? మా కాలమానంలో ఒక జీవి, ఒక మనిషిగా పుట్టటం, ఒక మనిషిగా పోవటం, దైవానికి సంబంధించిన కాలమానంలో పెద్దలెక్కలోది కాదు. మనకు కూడా నిజానికి మాట్లాడితే అలాగే కనపడుతుంది. నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పటికి 49 ఏళ్ళు ఈ శరీరం ధరించి, ఒకసారి వెనకకు తిరిగి ముందుకు తిరిగి చూస్తే, 'ఏంటీ? ఇంత తొందరగా అయిపోయింది జీవితం'- అనిపిస్తుంది. బాగా ఫాస్ట్‌గా అయిపోయింది. పెద్దగా పరిణామం చెందిందేమీ కనపడలేదు.
'ఇంతకాలం ఏం చేసినట్లు నేను?' ఆకాలగమనంలోనుంచి గనక చూస్తే దైవీస్థితిలోంచి గనుక చూస్తే, ఓసి, ఇంతేనా ఇది? ఏంటి చాలా ఫాస్ట్‌గా అయిపోయిందిదేదో? 45 మినిట్స్‌ 49 మినిట్స్‌ హార్డ్‌లీ. కుదించి చూస్తే నా సినిమాని, నా జీవితం అనే సినిమాని, హార్డ్‌లీ 45మినిట్స్‌ కూడా రావడం లేదు.
మనం చనిపోయే కాలంలో, మన సినిమా మనకు అలాగే చూపెడుతారు. మైక్రో ఫిల్మ్‌. చిత్రాల రూపంలో గుప్తంగా వున్న చిత్ర గుప్తుడు, మీ సినిమా మీకే చూపెడుతాడు. అదెంతో టైం పట్టదు. అర్థమైందా అండీ? నీవు జీవించిన కాలం మొత్తాన్ని సంక్షిప్తీకరించేస్తారన్నమాట. మీ సంతృప్తులు, అసంతృప్తులు. అంతేగా మన సినిమా? అంతకు మించి ఏముంటుంది? టక టక టక రీల్‌ తిరిగిపోతుంది. అవుననో, కాదనో చెప్తావుగా అప్పుడు. నిన్ను విమర్శించినవాళ్ళు, నిన్ను పొగిడిన వాళ్ళు, నిన్ను ఎదురించిన వాళ్ళు, నీకు రాగ ద్వేషాలు కలుగ జేసిన వాళ్ళు, వాళ్ళందరూ అందులో వుంటారా? వుండరా? నీ పక్క ఫ్రెండ్‌లు, కనపడినవాడు, కనపడనివాడు, పరోక్షంగా వున్నవాడు, ప్రత్యక్షంగా వున్నవాడు, వాళ్ళందరూ అక్కడ ప్రత్యక్షం అవుతారా? అవ్వరా? అవుతారు. ఇప్పుడు మనకు కలలో అవటంలేదా? అలాగే అక్కడ కూడా అవుతారు. నువ్వేంచేస్తావ్‌?
లాస్ట్‌ జడ్జ్‌మెంట్‌ డే, తుది తీర్పు దినము నాడు, నీవు నిర్ణయము చెప్పక తప్పవు. అర్థమైందా అండీ? నావాడు, పరాయి వాడు, అనే బేధబుద్ధి అక్కడ పనిచేస్తుందా? పనిచేయదా? కాబట్టి,
 జీవించి వుండగానే మనం సమబుద్ధిని సాధించవలె కదా! ఇప్పుడే సమబుద్ధిని సాధించకపోతే, చివరికాలంలో సమబుద్ధితో ఎట్లా ప్రవర్తిస్తావ్‌?
అదే భేద భావంతోనే, అప్పుడు మళ్ళా చిత్రగుప్తుడు నీ సినిమా చూపెట్టినప్పుడు ఏం చేస్తావ్‌? అలాగే టిక్‌ పెడుతావ్‌. టిక్‌ పెడితే అప్పుడు ఆయన ఏమంటాడు? ఇంకా నీకు దైవీ స్థితిలో లీనమయ్యేటటువంటి, దైవీ చైతన్యంలో లీనమయ్యేటటువంటి సమస్థితి రాలేదు నాయనా నీకు. ఈ మాలిన్యంతో, ఆ చైతన్యంలో లీనమవ్వడానికి వీలుకాదు. అయినా నేను ట్రై చేస్తాను అంటావు. ఆయన చెబితే మనం వింటామా ఏమిటీ? వింటే మొదట్లో జీవితంలో ఇప్పుడే బాగుపడేవాళ్ళం కదా! అప్పుడు కూడా అదే తీరుగా ప్రవర్తిస్తాం. ఆ చైతన్యం అనేటటువంటి మహా ప్రభంజనం, అందులోకి చేరడానికి ప్రయత్నించిన జీవులందరినీ కూడా ఏం చేస్తుంది? బయటకు మరళా విసిరేస్తుంది. విసిరేయగానే ఏమైపోతావ్‌? తత్‌ ప్రతిబింబ హేతువైనటువంటి, తల్లి గర్భాన్ని ఆశ్రయించేస్తావు. ఎంతో టైం పట్టదు. హార్డ్‌లీ మినిట్స్‌. ఈ భూమండలం మీద, వాయువు వ్యాపించి యున్న మేరకు ఎక్కడైనా పుట్టవచ్చును. అర్థమైందా అండీ? ఏ ఆఫ్రికా అడవుల్లోనో పుట్టాం అనుకోండి? నెక్ట్స్‌ జన్మకు. ఏమౌతాం? ఆహారం లేదు, చూస్తున్నాంగా అక్కడ మనం. వర్షాలు లేవు. ఆకలి. ఔనా, కాదా? ఆ దౌర్భాగ్య స్థితి వచ్చింది అనుకోండి. అప్పుడు మనం ఆత్మ, పరమాత్మ అంటానికి అవకాశం వున్నదా? మరి? ఆలోచించి చూడండి? వచ్చిన సువర్ణ అవకాశాన్ని వినియోగించు కుంటున్నామా? సద్వినియోగ పడుతుందా? లేకపోతే? ఇవాళ్టికి భోజనం చేశాం, ఈ పూటకు నిద్రపోయాం, సరే రోజు తిరిగిపోయింది. ఇంకొక పదేళ్ళు తిరుగుతుంది. తిరక్కపోతుందా? అదేమన్నా? మనం వున్నంతకాలం తిరుగుతుంది. ఇలాంటి నిరాసక్తపు మాటలకు తావిచ్చాం అనుకోండి? అప్పుడు ఏమైంది? "ఆ ఇంకేం చేస్తాం లేండీ? ఇప్పటికే 60 ఏళ్ళు వచ్చినాయి 70 ఏళ్ళు వచ్చినాయి" అనేవాళ్ళు చాలామంది వున్నారా, లేరా?
కానీ మహాభారత యుద్ధం జరిగేనాటికి, అర్జునునికి, శ్రీకృష్ణునికి ఎన్నేళ్ళండీ? బావాబావమరదుల ఇద్దరికీ? 120 యేళ్ళు. ఆ సమయంలో మహాభారత యుద్ధం చేశారు. అర్థమైందా అండీ? మరి 800 సంవత్సరాల పాటు ఆనాటి కాలంలో జీవించారు. మరి రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? 14 సంవత్సరాలు. కానీ ఆయన రాజ్యపాలన ఎంతకాలం చేశాడు? 16 వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఆయన ఆయుర్దాయం అది. ఆకాలంలో. 16 వేల సంవత్సరాలు. అందులో వనవాస కాలము ఎంత? కానీ మనం ఏమంటామండీ? రాముడు ఎంత కష్టపడ్డాడండీ? సీత ఎంత కష్టాలు అనుభవించిందండీ? అంటున్నామా? లేదా? సీత చివరికాలం ఒక సంవత్సరమేగా? లంకలో వుంది? అంతేనా కాదా? మరి ఆ తరువాత ఎంత కాలం పాటు రాజ్యపాలన చేశారట వాళ్ళు? పట్టాభిషేకం అయిన తరువాత, 16 వేల సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించారు వాళ్ళు. మరి ఏకాలం అది? ఇవాళ మనం ఏమంటున్నాము? 40 దాటినయ్యా? ఊ.. ఇహ రెడీ అయిపో! ఏమి అధ్వాన్నమైన జీవితం అండీ? ఇది. దేని కోసం పుట్టాం? దేని కోసం జీవిస్తున్నాం? కేవలం పిల్లల్ని కంటానికి, పిల్లల్ని జీవించటానికి, పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి, డబ్బులు వెనుకేయడానికి, ఇంతేనా జీవితం అంటే? మనిషి అంటే ఇంతేనా? ఇంత అల్పమైన వాటికోసమేనా మనిషి? అవే చేతకావడం లేదని ఆ భారమంతా నెత్తిన వేసుకుని దానికింద నలిగి పోవడం. చూడండి. ఆలోచించి చూస్తే, తత్త్వజ్ఞాన పరిధిలో చూస్తే, ఇదెంత అల్పజ్ఞానమో, ఎంత మనం మారవలసిన అగత్యం వుందో, దీనియొక్క అల్పత్వాన్ని మనం గ్రహిస్తే, గమనిస్తే, ఇప్పుడు దీనిని వదిలేసి ఎక్కడికన్నా పారిపోదామా? అబ్బే! అలా ఏం కుదరదు. కాకపోతే ఈ ప్రపంచంలోనే, ఆ దృష్టితో జీవించవచ్చు.
మహర్షులందరూ గృహస్థులు కాదా? గృహస్థులే కదా! మరి వాళ్ళకు అడ్డు రాని గార్హస్థ్యం, మనకు అడ్డమేమి వచ్చిందివాళ్ళు బోధించిందేగా విద్య! అవునా కాదా?
"Hands in the Society, Heads in the forest". అది వాళ్ళ జీవన విధానం. నష్టమేముంది?
సన్యాసిగా జీవించ లేవా? సన్యాసం ఆంతరంగికం. భౌతికం కాదది. "సంకల్ప త్యాగం ఒనర్చని వాడు యోగి కాజాలడు". భగవద్గీత చాలా చోట్ల చెప్తుందండీ. అట్టి యెడ సంకల్ప త్యాగం ఒనర్చని వాడు యోగి కాజాలడు. యోగియే కాని వాడు, సన్యాసి ఎట్లా అవుతాడు? జ్ఞాని ఎట్లా అవుతాడు? ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అనుభూతి, ఆ ఆత్మానుభూతి లేనివాడు సన్యాసి కాజాలడు. సన్యాస దీక్షకు పనికి రావు. చాలా మంది సన్యాసం పుచ్చేసుకుంటే ఒక గొడవ వదలిపోతుంది అనుకుంటారు. దానిని (సన్యాసాశ్రమ ధర్మాన్ని) నిలుపుకోవడం అత్యంత కష్టం. చాలా కష్టం అండి. ఆ ధర్మానికి నిలబడడం.
కారణం ఏమిటంటే, సన్యాసికి సరాసరి ఈశ్వరుడు కనపడుతాడు. మీరు భావిస్తే ఈశ్వరుడు కనపడతాడు. కాసేపే కనపడతాడా? ఆత్మానుభూతి కలిగినవాడికి, ఎప్పుడూ ఈశ్వరుడే కనపడుతాడు. సరాసరి ఈశ్వరుడితో మాట్లాడగలడు. అనుక్షణం రెప్పపాటు ఈశ్వరుడి ముందు అతనితో సంబంధపడి వుంటాడు. ఏ ఒక్క రెప్పపాటు కూడా పక్కకు తప్పుకునే అవకాశం లేదు. నా స్వవిషయం అంటానికి నువ్వు లేవు అక్కడ. అర్థమైందా అండీ? అట్లాంటి జీవితాన్ని, అట్లాంటి అనుభూతిని మనం సాధించినప్పుడు, అప్పుడు ఎలా వున్నాము? ఆ దివ్వత్వానికి, ఇప్పుడు మనం కాకరకాయ కూర దగ్గర, పులిహోర దగ్గర జీవించే జీవితానికి, ఒకసారి పోల్చి చూసుకోండి. అదే మానవ జీవితమే.
ఈశ్వరా! అని పిలవగానే, నీ పక్కనే, నీలోనే... నువ్వు నాలో వుండగా నన్ను పిలుస్తావేంటి అంటాడు ఈశ్వరుడు. అంతటి సరాసరి సంబంధాన్ని కలిగివుంటాడు ఆత్మానుభూతి కలిగినవాడు. అర్థమైందా అండీ?
కాబట్టి అక్కడ ప్రకృతి కనపడదిక. కేవలం ఈశ్వరుడే. అసలు ప్రకృతికి ఉనికే లేదు అక్కడ. ప్రకృతికే వునికి లేకపోతే, ప్రకృతి యొక్క పరిణామవాదమైన ప్రతిబింబమైన ప్రపంచం ఎట్లా కనపడుతుంది? అసాధ్యం.
అలాంటి ఆత్మానుభూతిలో నిరంతరం మునిగిపోయివున్న వాడెవడో, వాడు సన్యాసి. ఆ తురీయానుభూతిలో స్థిరమై పోయినవాడెవడో వాడు సన్యాసి. వాడిని అనారోగ్యాలు, రోగాలు, రొష్టులు, ఆకలి, దప్పిక, లాభం, నష్టం, స్వార్థం, జననం, మరణం వున్నాయా? వాడికి ఇవన్నీ? కనపడితేగా అసలు? అర్థమైందా అండీ! అవి కనపడ్డవారికి ఏమైనాయి? అవన్నీ వున్నాయి. అవి కనపడనివాడికి? లేవు. అర్థమైందా?
కాబట్టి, "యదృశ్యం తన్నశ్యం"- ఆ దృశ్యంతో పాటే నువ్వు నశించిపోతున్నావ్‌. ఎందుకని ఆ దృశ్యంతో కలిసిపోతున్నావు. యదృశ్యం తాదృశ్యం - అదొక సూత్రం.
ఏది కనపడుతుందో అది నువ్వైపోతావు క్షణములో. అప్పుడు ఏమైపోయావు? లేవు. ఇట్లా, ఏకకాలంలో జీవభావాన్ని, ఏకకాలంలో ఆత్మానుభూతిని సాధించడానికి ఉపయోగపడే గొప్పసాధనం, గొప్పనౌక. ఈ మానవదేహం.
కాబట్టి (ఈ ఉపాధిని) ఇటు తిప్పి వాడుకుంటామా? అటు తిప్పి వాడుకుంటామా? అనే విచక్షణాజ్ఞానం మనదే. అలా మనం ఆలోచించి జీవించినప్పుడు మాత్రమే, సరియైన నిష్కర్షతో కూడిన జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే, ఏవో కొన్ని వస్తూ వుంటాయి, పోతూవుంటాయి. కొంతమంది పొగుడ్తారు, కొంతమంది తెగుడ్తాడు. అంతేనా కాదా? నిన్నెవరు స్వీకరించమన్నారు? అంతేనా కాదా? ఓహో! నీ వల్ల ఇలాగే జరిగింది, నీ వల్ల ఇంత నష్టం వచ్చింది, నీ వల్ల అంతొచ్చింది, ఇంతైంది, అంతైంది, ఓహో! అలాగా. నీ వల్ల ఏమీ కాలేదు, నువ్వు వేస్ట్‌ ఫెలో, ఓహో! ఎందుకని? ఈశ్వరుడే అలా వున్నాడు, నేనేం ఖర్మ! అవునా కాదా? ఈశ్వరుడే నిష్క్రియుడు. ఏమీ చేయడు. ఎక్కడ కదలకుండా ఒక్కదగ్గరే కూర్చుంటాడు. అవునా కాదా?
మరి ఆ (కదలని) లక్షణం ఈశ్వరుడుది, నాది కాదు, అని స్థిరంగా వుండగలిగేటటువంటి మనోబుద్ధ్యహంకారాలు లేనటువంటి, చలన వేగం లేనటువంటి, కదలనటువంటి, స్థిరమైన నిష్ఠయే సమాధి. ఆ సమాధినిష్ఠను పొందిన వాడు ఏ జ్ఞానియైతే వున్నాడో? అతనికి సంకల్పములు లేవు. (అవునా కాదా?)
అట్టి సంకల్పములు లేని స్థితిలో వున్నవాడు ఎవడైతే వున్నాడో, వాడు సాక్షాత్‌ ఈశ్వరుడే. ఈశ్వరుడికి, వాడికి అభేదమై యున్నది. అట్టి అభేదమైన స్థితిని సాధించడానికి మానవజన్మ.
అట్టి అభేద స్థితిని సాధించటానికి అనువైనటువంటి మానవదేహం, అనుభూతిని సాధించేటటువంటి, దివ్యమైన స్థితిని సాధించటానికి కావలసిన అనువైన అమూల్యదేహం. కానీ మనం దేనికి వినియోగిస్తున్నాం? మీకు ఆ ఫైవ్‌స్టార్‌ చాక్లెట్‌ తింటే బాగుంటుందా? లేదంటే రామేశ్వరం వెళ్ళి చూసివస్తే బాగుటుందా? అంతేకదా! అలా నియమితమైనటు వంటి, పరిమితమైనటు వంటి వాటితో జీవించడం వల్ల ఏమైనా ప్రయోజనం వుందా? అనుక్షణం మిమ్మల్ని వెంబడించాలి. ఎప్పుడైతే అనుక్షణం అది మిమ్మల్ని వెంబడిస్తుందో,
ఆ తీవ్ర ముముక్షత్వం ఎప్పుడైతే మీలో పనిచేస్తుందో, అప్పుడు మీ ముందు ఏదీ నిలబడజాలదు. ఈ సమస్థ ప్రపంచము కూడా నిలబడజాలదు. రెప్పపాటులో మాయమై పోతుంది. రెప్పపాటే. అంతకంటే ఎక్కువ టైం పట్టదు. అసలు ఈ ప్రపంచం లేదు అని స్ఫురించడానికి ఒక రెప్పపాటు కాలం చాలు. అప్పుడు ఉన్నది బ్రహ్మమే అని వెంటనే తోస్తుంది. ఉన్నది బ్రహ్మము అని తోచాలంటే ఒక్కక్షణమే టైం పడుతుంది. అంతే అది చాలా ఎక్కువ. అట్లాంటి బ్రహ్మానుభూతిని సాధించేటటువంటి, అద్భుతమైనటువంటి మానవ ఉపాధి, అద్భుతమైనటువంటి జీవనం, అలాంటి ఉన్నతమైన లక్ష్యాలను అందిపుచ్చుకోవడానికి వుపయోగించుకోవాలి మీరందరూ!!


ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓమ్‌ తత్‌ సత్‌, ఓం శాంతిః శాంతిః శాంతిః